ఏడుకొండలపై కొలువుదీరిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్ల మంది భక్తులు తపిస్తుంటారు. ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని మూటగట్టుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు, అవకాశాలు, టికెట్లపైనే భక్తులకు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి. శ్రీవారి దర్శనానికి ఆన్లైన్, ఆఫ్లైన్లలో తితిదే కల్పిస్తున్న అవకాశాలను తెలుసుకునేందుకు వారు ఆరాటపడుతుంటారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తితిదే వివిధ ఏర్పాట్లను చేస్తోంది. శ్రీనివాసుడి దర్శనానికి ఉన్న అవకాశాలు ఏంటి తదితర వివరాలనుఈ ఆర్టికల్ లో చూద్దాం
తిరుమల దర్శనానికి మార్గాలు
శ్రీవారి సర్వదర్శనం
తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి టికెట్లు లేకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దీన్నే శ్రీవారి సర్వదర్శనం అంటారు. వీరిని క్యూలైన్ల నుంచి వైకుంఠం-2లోని 32 గదుల మీదుగా పంపిస్తారు. అక్కడినుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఏర్పాటుచేసిన తొమ్మిది కంపార్టుమెంట్లలో దర్శనానికి వేచి చూసే అవకాశం ఉంటుంది. అవీ నిండితే క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తుంది.. క్యూలైన్ నుంచి వైకుంఠం-2లోకి ప్రవేశించే సమయంలో దర్శనం ఎన్ని గంటలకో సూచిస్తూ టోకెన్ ఇస్తారు. ఎక్కువ సమయం ఉంటే అక్కడినుంచి బయటకు వెళ్లి తమకు కేటాయించిన దర్శన సమయానికి గంట ముందు పశ్చిమ మాడ వీధి నుంచి మ్యూజియం వెళ్లే దారిలో ఉన్న మార్గంలో కంపార్టుమెంటులోకి వెళ్లవచ్చు.దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు భోజనం, టీ, పాలు సరఫరా చేస్తారు. వైద్య సదుపాయమూ లభిస్తుంది. అలిపిరి నుంచి నడక మార్గంలో వచ్చే భక్తులకు దర్శనానికి సంబంధించిన టైమ్ స్లాట్ టోకెన్లు ఇస్తారు. వీరు తమకు నిర్దేశించిన సమయానికి వీరు వైకుంఠం-1నుంచి కంపార్టుమెంట్లలోకి ప్రవేశించాలి. తిరుపతిలో తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ 14 వేల టికెట్లు అలిపిరి వద్ద భక్తులకు ఇష్తారు.
ప్రవాసాంధ్రులకు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ)
పాస్పోర్టుపై ఇమ్మిగ్రేషన్ స్టాంపు చూసి నెలలోపు తిరిగి వెళ్లాల్సి ఉంటే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. వీరు పాస్పోర్టు, ఆధార్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. ఏపీఎన్ఆర్డీఎస్ ద్వారా రోజుకు రెండు సిఫారసు లేఖలు ఇస్తారు. ఒక్కో లేఖపై ఆరుగురికి ప్రవేశం ఉంటుంది. సుపథం వద్ద వీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
శ్రీవాణి దర్శనం.. టికెట్ రూ.10వేలు
శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు రూ.10 వేల విరాళమిచ్చే వారి నుంచి అదనంగా రూ.500 తీసుకుని టికెట్ ఇచ్చి ఒకరికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. రోజుకు 1500 టికెట్లు ఇస్తారు.రేణిగుంట విమానాశ్రయం, తిరుమలలో ఇచ్చే టికెట్లతో మరుసటి రోజు దర్శనం చేసుకోవచ్చు. మూడు నెలల ముందు ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. రెండు గంటల్లోపు అత్యంత దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..
శ్రీనివాస దివ్యానుగ్రహహోమం.. ఇద్దరికి దర్శనం
తిరుపతిలోని అలిపిరి వద్దనున్న సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి రూ.వేయి చెల్లించి ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా రోజూ ఉదయం ఐదింటికి ఇక్కడే టికెట్లు ఇస్తారు. హోమం తర్వాత అక్కడి అధికారి స్టాంప్ వేసి ఇస్తే దానిపై ఇద్దరికి రూ.300 శ్రీవారి దర్శనం టికెట్ల అవకాశం లభిస్తుంది. దర్శనానికి సాధారణంగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.
బ్రేక్ దర్శనం
ఏపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపిలు , బోర్డ్ మెంబర్స్, ఐఎఎస్, ఐపిఎస్ సిఫార్సు లేఖలపై బ్రేకర్ దర్శన అవకాశం ఉంటుంది. సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనం, గది ఇస్తారు. ప్రజాప్రతినిధుల నుంచి ప్రతి రోజు ఒక లేఖ అంగీకరిస్తారు.ఐఎఎస్ ఐపిఎస్ లకు వారానికి రెండు లెటర్లకు అవకాశం కల్పిస్తారు. ఒక లెటర్ పై ఆరుగురు భక్తులు నేరుగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అత్యంత దగ్గరగా దర్శన అవకాశం ఉండటంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. లెటర్ తీసుకుని వెళ్లి జెఈఓకార్యాలయంలో ఇస్తే సాయంత్రం5 గంటలకు అక్కడ నుంచి మన నెంబర్ కు మెసేజ్ వస్తుంది అనంతరం ఆ కార్యాలయానికి వెళ్ళి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు గంట లోపు దర్శనాన్ని పూర్తి చేసుకోవచ్చు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు(300రూపాయల టికెట్లు)
మూడు నెలల ముందు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెల మొత్తానికి ఆన్ లైన్ విధానంలో 1.32 లక్షల టికెట్లను భక్తల కోసం అందుబాటులో ఉంచుతారు. భక్తులు వైకుంఠం 1 నుంచి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది..
నవదంపతులకు ఇలా
తిరుమలలో కల్యాణం చేసుకున్న దంపతులకు ఆరు టికెట్లు ఇస్తారు. వరుడు , వధువు, ఇరు కుటుంబాల తల్లితండ్రులకు అవకాశం ఉంటుంది. సుపథం ద్వారా లోనికివెళ్లి దర్శనం చేసుకోవచ్చు.
నవదంపతులు కల్యాణోత్సవం టికెట్ అంటే వెయ్యి రూపాయల టికెట్ పైనా దర్శనం చేసుకోవచ్చు. ఆ వారంలోపు పెళ్లి జరిగినట్లు వివాహ ధ్రువీకరణ కార్యాలయంలో చూపి ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐది నమోదు చేసుకోవాలి. వీరికి తర్వాత రోజు జరిగే కల్యాణోత్సవంలో అవకాశం కల్పిస్తారు.. కల్యాణం తర్వాత స్వామి దర్శనం కల్పిస్తారు. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.
శ్రీవారి దర్శనానికి చిన్నపిల్లలున్న వారికి ప్రత్యేక కోటా ఉంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు మూడు నెలల ముందు ఆన్లైన్లో బాబు లేదా పాప పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో బుక్ చేసుకోవాలి. ప్రతి నెలా కోటా విడుదల చేస్తారు. శ్రీవారి ఆలయం ముందునుంచి వీరికి ప్రత్యేక క్యూలైన్ ఉంటుంది..వృద్ధులు, దివ్యాంగులు మూడు నెలల ముందు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. సాయంత్రం మూడింటికి వీరికి ప్రత్యేక స్లాట్లు కేటాయిస్తారు. ఆన్లైన్లో రోజుకు 750 టికెట్లు ఇస్తున్నారు.
సైనికులు.. రక్తదానం చేసేవారు
భారత సైన్యంలో పనిచేసేవారికి రూ.300 టికెట్ ఇస్తారు. తమ ఐడీ కార్డు చూపి టికెట్ తీసుకోవచ్చు. ఇక అశ్వనీ ఆసుపత్రిలో రక్తదానం చేసేవారికి సుపధం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. వైద్యుల నుంచి రక్తదానం చేసినట్టు తీసుకున్న ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది.